అక్టోబర్ 1 న అల్లు స్టూడియోస్ ప్రారంభం … పుష్ప 2 అందుకే వాయిదా పడిందా?

Allu studios | ఈ జనరేషన్ కి పెద్దగా తెలియని విషయం ఒకటుంది. 1970 లో అల్లు వారి గీతా ఆర్ట్స్ మొదలైంది. అప్పట్లో మురళీమోహన్, చలం లాంటి హీరోలతో సినిమాలు చేసిన గీతా ఆర్ట్స్, చిరంజీవి అల్లువారి అల్లుడైన తరువాత ఆయన సినిమాలకే పరిమితమైంది. కొన్నేళ్లపాటు అల్లు ఇమేజ్ ని మెగా ఇమేజ్ డామినేట్ చేసింది. చిరంజీవి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చాక సినిమాలన్నీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై, లేదా వారి కో-ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్నాయి. మరోపక్క … అల్లు అర్జున్ రూపంలో గీతా ఆర్ట్స్ కు కూడా సొంత హీరో తయారయ్యాడు. అంతేకాక గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై చిన్న హీరోలతో సినిమాలు కూడా నిర్మిస్తూ మెగా ఇమేజ్ నుండి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కరోనా కారణంగా అల్లు అరవింద్, వచ్చిన లాక్ డౌన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ‘ఆహా’ ఒటిటి ఏర్పాటు చేసి మెగా కాంపౌండ్ కన్నా మూడడుగులు ముందే ఉన్నాడు.

కొన్ని నెలల క్రితం, మెగా ఫ్యామిలీ కూడా ఓ ఒటిటి ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉందంటూ వార్తలు వచ్చినా, ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కొన్నేళ్ళనుంచి మెగా ఫ్యామిలీ కి, అల్లు కాంపౌండ్ కి దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆహా మొదలయ్యాక ఆ దూరం మరింత పెరిగిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో మనకి తెలియదు గానీ ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే…

కోకాపేట లో అల్లు స్టూడియోస్ నిర్మాణం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఇది దాదాపుగా పూర్తయింది. అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్య గారి నూరవ జయంతి సందర్భంగా ఈ స్టూడియో ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే ఓ 20 మంది హాస్యనటులకు చిరంజీవి చేతుల మీదుగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఈ స్టూడియోలో మొదటి సినిమాగా పుష్ప 2 ప్రారంభించనున్నట్టు అనధికారిక సమాచారం. బహుశా ఇందుకే పుష్ప 2 ను లేట్ చేశారేమో అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.